Monday 12 May 2014

ఒక తల్లి కథ


ఒక పదహారేళ్ళ అమ్మాయి.. ఆడుతూ పాడుతూ ఎన్నో కలలతో, కొత్త ఆశలతో హాయిగా పొలాల గట్లపైన పరుగులుతీస్తూ, పక్షులతో మురిపెంగా మాటలాడుతూ, పిల్లలతో కేరింతలు కొడుతూ తన అందమైన ప్రపంచంలో తనే మహారాణిగా జీవించేది. ఇంట్లో ఉన్నప్పుడు అణకువగా అమ్మకు సహాయం చేస్తూ ఒక సేవకురాలిగా ఉండేది. ఆమె పేరు దుర్గ. కొంచం కొంచంగా విద్యాబుద్ధులు కూడా నేర్చుకుంది. దుర్గలో ఉన్న సుగుణం ఆమె సహనం. రెండేళ్ళు గడిచాక, దుర్గకు వివాహమైంది. 




పుట్టింట్లో ఎంత అల్లరి, అణకువో.. అత్తింట్లో అంతే అణకువ, సహనం. ఆ ఇంటికి వచ్చిన కోడలిగా కొత్త బాధ్యతను ఎత్తుకుంది. ఉదయం నుంచి, రాత్రి వరకు అందరినీ చూసుకుంటూ, అన్ని పనులూ చేసుకుంటూ, ఆ ఇంటికి తానొక మహారాణిలా బాధ్యతగా మసలుకుంది. అవసరమైతే సేవకురాలయ్యింది. భర్తకు తానొక ఊతమయ్యింది. అత్తమామలకు మంచి మనసుతో సేవలు చేసింది. కొన్నాళ్ళకి తాను నోచిన నోముల ఫలంగా ఒక మగబిడ్డకు తల్లి అయ్యింది. ఆమె గౌరవం, బాధ్యత రెట్టింపు అయ్యింది. పొత్తిళ్ళలో తన బిడ్డను చూసుకుని మురిసిపోయింది. పెద్ద పండగలా ఊరివారందరికీ భోజనాలు వడ్డించింది. వచ్చినవారందరూ తనబిడ్డను దీవిస్తూ ఉంటే ఎన్నో ఆనంద భాష్పాలను రాల్చింది. ఆ బిడ్డను చూసుకుని తనివితీరా మురిసిపోయింది. బిడ్డ పెరిగి పెద్దవాడవుతూ ఉంటే, అతడి ఉన్నతిని చూసి ఉప్పొంగిపోయింది. దుర్గ ఇప్పుడు అమ్మ అయ్యింది. తన కొడుకు వేసే ప్రతీ అడుగుని గమనిస్తూ, తడబడితే ఊతమిస్తూ, తప్పటడుగులు వేస్తే సరిచేస్తూ నీడలా కంటికి రెప్పలా కాపాడుకుంది. తన కొడుకు పెద్దవాడై డాక్టరు అయ్యాడని ఊరంతా గర్వంగా చెప్పుకుంది. 


కానీ, అంతలోనే విషాదం. దుర్గమ్మ భర్త మరణం. అత్తమామలు ఎప్పుడో కాలం చేశారు, ఇప్పుడు భర్త కూడా వీడిపోయినా, తన బిడ్డ ఉన్నాడనే ధైర్యంతో ప్రాణాలు బిగబట్టుకుని బ్రతికేస్తోంది.
కొన్నాళ్లకు తన కొడుకు కోరుకున్న అమ్మాయితోనే వివాహం జరిపించింది. ఊరిలో ఉండటం కుదరదని చెప్పి, కొడుకు దుర్గమ్మని సిటీకి తీసుకు వచ్చాడు. అక్కడ అంతా కొత్త. ఆమెకు ఊరు తప్ప, పట్నం పెద్దగా పరిచయం లేనిది. కొడుకు ఇంట్లో వేరే ఒక గదిని ఇచ్చారు దుర్గమ్మకి. కొడుకు డాక్టరు కావటం చేత బాగానే సంపాదన ఉండటం చేత, ఇంట్లో ముగ్గురు పనిమనుషులు ఉండేవారు. అన్ని పనులూ వారే చూసుకునేవారు. వారిలో ఒక పనిపిల్ల లక్ష్మి. ఆ పిల్లకి పదిహేనేళ్ళు ఉంటాయి. దుర్గమ్మకి రోజులో ఎక్కువ కాలక్షేపం లక్ష్మితోనే. తన కొడుకుని రోజుకి ఒకసారైనా చూసుకోవాలనుకున్నా అతనికి వీలుపడక, ఏ మూడురోజులకో అలా కనపడేవాడు. అది కూడా కొంచం ఇబ్బందిగా దుర్గమ్మను కసురుకునే వాడు. పని వల్ల అలసి ఉన్నాడులే అని దుర్గమ్మ అనుకునేది. కొన్నాళ్ళకు కలిగిన మనుమడితో కొంత కాలక్షేపం దొరికింది దుర్గమ్మకి. కానీ, మళ్ళీ బాధ. కొడుకు తన కుటుంబంతో కలిసి అమెరికాకు వెళ్ళిపోదామనుకున్నాడు. ఆ తల్లి మనసు ఎంతగానో బాధపడింది. వద్దని వారించలేక, వాడి అభివృద్ధి కోసమే కదా అని సర్దుకుంది. వాళ్ళు విదేశానికి వెళ్ళిపోయారు. దుర్గమ్మను వేరే ఒక చిన్న ఇంట్లో ఉంచారు. నెల నెలా కొంత డబ్బు పంపేవారు. కొంతకాలమయ్యాక కొడుకుకి అక్కడి విలాసాలు బాగా అలవాటై, ఇక్కడ ఉన్న తల్లిని మరిచాడు. డబ్బు పంపటం భారంగా భావించాడు. డబ్బు లేక కాదు, సమయం వృధా అనుకుని. కొడుకు పంపే డబ్బు కన్నా అతడి ఉన్నతినే ఎప్పుడూ కోరుకున్నది దుర్గమ్మ. డబ్బులు లేవని ఆ ఇంటివారు దుర్గమ్మను బైటికి పంపేశారు. తన ఊరికి వెళదామన్నా అక్కడి ఇంటిని కొడుకు పెళ్ళి కోసం అమ్మేసింది. అక్కడ ఏదీ మిగిలిలేదు. దారిలేక, వెళ్ళి ఒక గుడిలో తలదాచుకుంది. గుడిలో ఊరికెనే ఉంటే బాగుండదని గుడిమెట్లు కడుగుతూ, ఊడుస్తూ బ్రతికింది. కొన్నాళ్ళకి అనారోగ్యం పాలు అయ్యింది. పాపం దుర్గమ్మను చూసిన వారే లేరు. పైగా గుడినుంచి అక్కడవారు ఆమెను బైటికి పంపేశారు. రోడ్డుపైన తిండిలేక, చూసే దిక్కులేక
వారం రోజులు అలాగే పడి ఉన్నది దుర్గమ్మ. 

ఒకసారి అటువైపుగా వచ్చిన లక్ష్మి, దుర్గమ్మను చూసి గుర్తుపట్టి తనతో తీసుకెళ్ళి కొన్ని మంచినీళ్ళు తాగించి, అన్నం కలిపి తినిపించింది. కొంత మేలుకున్న దుర్గమ్మ కళ్ళలో నీళ్ళు తిరిగాయి. చల్లగా ఉండు తల్లీ అని లక్ష్మి తలపై చేయిపెట్టి అలాగే చనిపోయింది దుర్గమ్మ. దుర్గమ్మ స్థితిని చూసిన లక్ష్మి ఏడుపు ఆపుకోలేకపోయింది. అంత బాధనూ గుండెల్లో దాచుకుని, మనసులో కూడా కొడుకుని తిట్టుకోలేదు దుర్గమ్మ. తల్లికున్న గుండెలోని మమకారమే అది. ఒకప్పుడు గట్ల మీద హాయిగా ఆడుకున్న అమ్మి, గొప్పింటి కోడలిగా వెలిగిన ఇల్లాలు,.. ఈ పూట తన పేగుతెంచుకు పెట్టిన కొడుకు ఘనతవలన ఈ స్థితికి వచ్చింది. ఎందరో సుపుత్రులు ఈకాలంలో తల్లులకు మిగులుస్తున్న బాధల్లో దుర్గమ్మ కథ ఒకటి. ఇలాగే ఆ బరువుని మోస్తూ, రోడ్డున పడి రోదిస్తున్న తల్లి గుండెలు ఎన్నో ఉన్నాయి ఈ కాసుల ప్రపంచంలో. 


దయచేసి జన్మనిచ్చిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో రోడ్డున పడేలా చేయొద్దని ప్రతి తల్లి తరపునా ఒక మనవి.